🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 04 Aug, 2026 | Page: 1

మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన జర్నలిస్ట్ అరెస్ట్, రిమాండ్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు: హుస్నాబాద్ ఏసీపీ సదానందం
హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్టీ మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో భైరాన్‌పల్లి గ్రామానికి చెందిన ఒక ప్రముఖ దినపత్రిక విలేకరి జెగ్గం అనిల్ కుమార్అ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధిత మహిళా అధికారి ఇచ్చిన ఫిర్యాదులో, జెగ్గం అనిల్ కుమార్ గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మద్దూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో, మద్దూరు ఎస్‌ఐ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మంగళవారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం స్వయంగా బాధిత మహిళా అధికారిని విచారించి, కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. విచారణలో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితుడు జెగ్గం అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు.
ఈ విచారణలో చేర్యాల సీఐ రమేష్ నాయక్, మద్దూరు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home