🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 04 Aug, 2026 | Page: 1

అప్పుల బాధతో రైతు బలవన్మరణం..

చేర్యాల పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య.. కుటుంబంలో విషాదం
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన శెట్టె రామస్వామి (38) వ్యవసాయం కోసం ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడం తదితర అవసరాల నిమిత్తం అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురైన రామస్వామి సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో స్వల్ప వాగ్వాదం అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెళ్లిపోయారు.
తర్వాత చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
మంగళవారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానిక యువకుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య శెట్టె లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే తండ్రి కనకయ్య అనారోగ్యంతో మృతి చెందగా, సోదరుడు కూడా కొంతకాలం క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామస్వామి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కొత్త దొమ్మాట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
🏠 Home