🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 01 Aug, 2026 | Page: 1

హలో... మున్సిపల్..నా వైపు ఓ లుక్కేయండి!గాంధీ రహదారి ఏరియా కథనం..


*​"నేను కూడా మీ మున్సిపల్ పరిధిలోని రహదారినే... మరి నా దుస్థితి ఎందుకు కనిపించడం లేదు?"*
*​గాంధీ ఏరియా రాకపోకలు నరకప్రాయం... ఉన్న బస్టాప్ ను తీసేసారు..*
*​నాసిరకం బ్రిడ్జి డిజైన్ తో ప్రాణ సంకటం.. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిత్యం భయం భయం!*
గాంధీ విగ్రహం తీసేయగానే.. నన్నూ లెక్కలోంచి తీసేసారా..?
​చేర్యాల (హిందూస్థాన్ మీడియా ):
*​గాంధీ ఏరియా రహదారి ఆవేదన కథనం*
​"హలో మున్సిపల్... నేను గాంధీ ఏరియా నుంచి కడవేర్గు వైపు వెళ్లే ప్రధాన రహదారిని. మీ చేర్యాల మున్సిపాలిటీ పన్నుల పరిధిలోనే ఉన్నాను. కానీ నా ఈ ఛిద్రమైన దుస్థితి మాత్రం అధికారుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు...?" అంటూ సదరు రహదారి స్వయంగా తన గోడును చెప్పుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో, సరిగ్గా అలాంటి భయానక వాతావరణం చేర్యాల పట్టణంలో దర్శనమిస్తోంది. రోజురోజుకూ అధ్వానంగా తయారవుతున్న ఈ రహదారిపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
*​అశాస్త్రీయ నిర్ణయాలు – పాలకుల బేఖాతరు*
​గాంధీ విగ్రహం వద్ద రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు చేసిన అశాస్త్రీయ మార్పుల వల్ల ప్రధాన బస్సు నిలుపదలను (బస్ స్టాప్ )రద్దు చేశారు. దీంతో కడవేర్గు , పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, శభాష్‌గూడెం, నాగపురి తదితర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక గాంధీ ఏరియాలో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణ లోపాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గాంధీ ఏరియాలో నిర్మించిన బ్రిడ్జి పరిస్థితి చూస్తే... అది ప్రజల సౌకర్యం కోసం కట్టారా? లేక ప్రమాదాలకు ఆహ్వానం పలకడానికా? అనే సందేహం కలుగుతోంది. బ్రిడ్జి ఎక్కే ప్రతి వాహనదారుడు గుండెల్లో గుబులు పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఏ ఇంజనీరు రూపకల్పన చేశాడో... ఏ ప్రమాణాలతో నిర్మించారో ప్రజలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.బ్రిడ్జి ఎక్కే క్రమంలో ఏ క్షణంలో ఎదురుగా వచ్చే వాహనం ఢీకొంటుందో తెలియక వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది.
*​మృత్యుకూపాలుగా మారిన గుంతలు – హామీలన్నీ నీటిమూటలే!*
​గాంధీ ఏరియా నుంచి కర్షక్ నగర్ వరకు ఉన్న రహదారి పొడవునా గోతులు కావు... ఏకంగా మృత్యుకూపాలు వెలిశాయి! వర్షం పడితే చాలు ఈ గుంతలు నీటితో నిండిపోయి ప్రాణాంతకమైన చెరువులుగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, పసిపిల్లలతో వెళ్లే మహిళలు గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. "త్వరలోనే రోడ్డు వేస్తాం... గుంతలు పూడుస్తాం" అంటూ మున్సిపల్ అధికారులు, పాలకులు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని, ఆచరణలో మాత్రం నిలువునా మోసం చేస్తున్నారని పట్టణ ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
*​గాంధీ పేరు కాపాడండి –మున్సిపల్ పాలకులకు హెచ్చరిక*
​జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని వార్డుల పాలన సాగించడం కాదు... ఆ పేరు ఉన్న ప్రాంత ప్రజల కష్టాలను, నరకయాతనను తీర్చడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి.
గుంతలు పూడుస్తామని సమావేశాల్లో తీర్మానాలు... ఫైళ్లలో ఆదేశాలు... మీడియా ముందు హామీలు... కానీ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదు.
ప్రజలు పన్నులు కడుతున్నారు... కానీ ప్రతిఫలంగా గుంతలే దక్కుతున్నాయి. ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే అధికారుల కళ్లు తెరుచుకుంటాయా? అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
గాంధీ పేరు పెట్టుకుని అభివృద్ధి మాటలు చెప్పడం కాదు... గాంధీ పేరు ఉన్న ప్రాంత ప్రజలకు కనీస రహదారి సౌకర్యం కల్పించడం నిజమైన నివాళి.

"హలో మున్సిపల్... ఇంకెంతకాలం ఈ గుంతలనే అభివృద్ధిగా చూపిస్తారు..? ప్రజల ప్రాణాలకు ధర కట్టి చూస్తారా... లేక ఇప్పటికైనా మేల్కొంటారా..?"
.. ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం.. కర్షక్ నగర్ దగ్గర రోడ్డు మరమ్మతులు చేపట్టారు... అలాగే గాంధీ ఏరియాలో కూడా చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
🏠 Home