🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 29 Jul, 2026 | Page: 1

ముందు రోడ్లు బాగు చేయండి.. తర్వాత చలాన్లు వేయండి

*అధికారులను ప్రశ్నిస్తున్న కర్షక్ నగర్, గాంధీ చౌరస్తా వాసులు*
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండల పరిధిలోని కర్షకనగర్, విద్యానగర్, ఉట్లపల్లి, గాంధీ చౌరస్తా ప్రాంతాల్లో రహదారులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారినా సంబంధిత అధికారులు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విద్యానగర్ చౌరస్తా వద్ద పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ చలాన్లు విధిస్తుండడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడం అవసరమేనని అంగీకరిస్తూనే, ముందుగా సురక్షితమైన రహదారులను కల్పించడం కూడా అధికారుల బాధ్యతేనని అభిప్రాయపడుతున్నారు.
నిత్యావసరాల కోసం చేర్యాల పట్టణానికి వెళ్లే ప్రజలు గుంతల రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొంటున్నారు. రహదారుల దుస్థితి కారణంగా ప్రమాదాల భయం వెంటాడుతుండగా, మరోవైపు తనిఖీల పేరుతో జరిమానాలు విధించడం ప్రజలకు అదనపు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా రహదారులను మరమ్మతులు చేసి సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాతే ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్, స్థానిక 7వ, 8వ వార్డు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యానగర్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
🏠 Home