🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 26 Jul, 2026 | Page: 1

కళ్యాణ కట్టలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు :వేములవాడ ఈవో

*నాయి బ్రాహ్మణులకు దేవస్థానం ఈవో రమాదేవి హెచ్చరిక*
హిందుస్థాన్ మీడియా, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి తీవ్రంగా స్పందించారు. భక్తుల వద్ద నుంచి నగదు డిమాండ్ చేయడం, వసూలు చేయడం వంటి చర్యలు దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత రెండు మూడు రోజులుగా కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు నాయి బ్రాహ్మణులు భక్తుల నుంచి నగదు అడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలోకి రావడంతో దేవస్థానం యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనలపై స్పందించిన ఈవో రమాదేవి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా నేరుగా దేవస్థానం కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులను తన కార్యాలయానికి పిలిపించి సమావేశం నిర్వహించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆలయ అసిస్టెంట్ ఈవోలు జయకుమారి, నాగుల మహేష్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాజేందర్, ఆలయ ఉద్యోగులు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. దేవస్థానంలో భక్తులకు పారదర్శకమైన, ఇబ్బందులు లేని సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
🏠 Home