🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 25 Jul, 2026 | Page: 1

సిరిసిల్ల పోలీసుల ఉక్కుపాదం....60 బైకులు 3 లీటర్ల మద్యం స్వాధీనం

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
రాజీవ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.. 60 ద్విచక్ర వాహనాలు, 3 లీటర్ల మద్యం స్వాధీనం
సీసీటీవీలు ఏర్పాటు చేసుకోండి.. అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించండి: డీఎస్పీ నాగేంద్రచారి
హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల: ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్‌నగర్లో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అన్నారు. కాలనీల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్–ప్రజల సమన్వయంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాతే వాహనాలను విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న కొక్కుల ఆంజనేయులుపై కేసు నమోదు చేసి 3 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
నేర నియంత్రణలో భాగంగా పాత నేరచరిత్ర కలిగిన అనుమానిత వ్యక్తులను పోలీసులు తనిఖీ చేసి వారి ప్రస్తుత నివాసం, ఉపాధి, కార్యకలాపాలపై వివరాలు సేకరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించడంతో పాటు, తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాలనీలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు, చోరీలు, ఇతర నేరాలను గుర్తించడం సులభమవుతుందని డీఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఏర్పాటుకు పోలీస్ శాఖ అవసరమైన సాంకేతిక సూచనలు, సహకారం అందిస్తుందని చెప్పారు.
యువత గంజాయి, మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ప్రజా శాంతికి భంగం కలిగించే, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు నాగరాజు, గణేష్, రంజిత్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్ తో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home