ఐదు లక్షల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి
ప్రభుత్వ ఆర్థిక సహాయం.. నెరవేరిన స్వప్నం
దశాబ్దాల కల నెరవేరిన వేళ
అద్దె భారం.. ఇబ్బందులు దూరం
సొంత ఇంట్లో సంబురం
ఇప్పటివరకు 3,470 ఇండ్ల నిర్మాణాలు పూర్తి
లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ.216 కోట్లు జమ
రాజన్న సిరిసిల్ల/చందుర్తి, జూలై -23 హిందుస్థాన్ మీడియా :
అర్హులైన వారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మించుకోవాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరతున్నది. రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయంతోనే లబ్ధిదారుల దశాబ్దాల కల సాకారమై వారి స్వగృహం సొంతమవుతున్నది. అద్దె భారం, ఇబ్బందులు దూరమై ఆ ఇందిరమ్మ ఇండ్లు ఆనందం, ఆత్మ గౌరవ ప్రతీకకు వేదికగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 3,470 ఇండ్లు పూర్తి కాగా, రూ. 216 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి.
అర్హులైన వారు సొంతిల్లు కట్టుకునేలా ఆర్థిక సాయం అందించి మద్దతుగా నిలవాలని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అర్హులు తమ సొంత స్థలంలోనే
నిర్మించుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానించి.. ఇండ్ల నిర్మాణానికి దశల వారీగా మొత్తం రూ. ఐదు లక్షలు అందజేస్తుంది.
వేగంగా ఇండ్ల నిర్మాణాలు..
ప్రజా ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళిక ప్రకారం పథకాన్ని లబ్దిదారులకు అందిస్తూ.. వారి ఇబ్బందులు దూరం చేస్తుంది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. పనుల్లో వేగం పెరిగేలా మార్గ నిర్దేశం చేస్తున్నారు. దీంతో
ప్రజా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటూ తమ కలను సాకారం చేసుకుంటున్నారు.
రూ. 216 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ మొత్తం ఇండ్లు 7,367మంజూరు చేశారు. 5,932 ఇండ్లకు ముగ్గు పోశారు. బేస్ మెంట్ స్థాయిలో 5,138 ఉన్నాయి. గోడల స్థాయిలో 4,534 ఉండగా, 4,229 ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయి. 3,470 ఇండ్లు పూర్తి అయ్యాయి. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం 216 కోట్ల రూపాయలు నేరుగా జమ అయ్యాయి. ఇండ్లు పూర్తి అయి.. పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు పూర్తి అయ్యాయి.
ప్రభుత్వ సహాయం.. సద్వినియోగం..
జిల్లాలోని చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు తమ సొంత స్థలంలో ప్రజా ప్రభుత్వం విడతల వారీగా అందజేసిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని రూ. 5 లక్షలలోపే తమ సొంత ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని తమ దశాబ్దాల కలను నెరవేర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంతో పడుతున్న ఇబ్బందులు, అద్దె భారాలు దూరమై స్వగృహకల నెరవేరిందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన సహాయం లోనే అధికారుల సూచనల మేరకు లబ్ధిదారులు ప్రతి పనికి ప్రణాళిక ప్రకారం డబ్బులు ఖర్చు చేసి ప్రభుత్వ ఆర్థిక సహాయంతోనే ఇండ్లను పూర్తి చేసుకోవడం మంచి పరిణామం.
ఐదు లచ్చల ఇల్లు అయింది..
మారుపాక నర్సవ్వ, కట్టలింగంపేట, చందుర్తి మండలం
సొంత ఇల్లు లేక మస్తు కిరాయి ఇండ్లల్ల తిరిగినం. మాకు దేవునోలే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరు. ఆల్లు ఇచ్చిన రూ. ఐదు లచ్చలోనే ఇల్లు అయింది. కిరాయి బాధలు తప్పినయి. మాకు ఇల్లు ఇచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీన్ననకు, కలెక్టర్ మేడమ్ అగ్రవాల్ కు పది వేల దండాలు.
ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డం
పల్లికొండ మౌనిక, కట్టలింగంపేట, చందుర్తి మండలం
నా పేరు పల్లికొండ మౌనిక. మేము సొంత ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డం. అద్దె ఇంట్లో ఉండి కిరాయి చెల్లిస్తూ ఆర్థికంగా సమస్యలు ఎదురుకున్నాము. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించిన 5 లక్షల్లోనే ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు ఇప్పించి ఆర్థిక సహాయం మంజూరు చేయించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.